![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 07:46 PM
హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమణ, అక్రమ నిర్మాణాల సమస్యల పరిష్కారం కోసం రేవంత్ సర్కార్.. హైదరాబాద్ విపత్తు నిర్వహణ, ఆస్తి రక్షణ సంస్థ హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రంగనాథ్ కమిషనర్‌గా ఉన్న హైడ్రా .. నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతుంది. భాగ్యనగరంలో హైడ్రా ఏర్పాటు చేసిన దగ్గర నుంచి.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టే వారికి వెన్నులో ఒణుకు మొదలైంది. అక్రమ నిర్మాణమని రుజువైతే చాలు.. ఆ కట్టడాలను కూల్చి వేస్తుంది. హైడ్రా పని తీరుపై భాగ్యనగర వాసులు ప్రశంసలు కురిపించారు. హైడ్రాకు జనాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ఇక నగర వ్యాప్తంగా అనేక అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణల నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పేరును కొందరు తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు. నగరంలోని కొందరు కేటుగాళ్లు.. హైడ్రా అధికారులమని చెప్పుకుంటూ సామాన్యులను బెదిరిస్తూ.. మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నార్సింగిలో హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
హైడ్రా అధికారులమని చెప్పి సామాన్యులను బెదిరిస్తున్న ఇద్దరు వ్యక్తులను నార్సింగి పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం అనగా జూన్ 23, సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులిద్దరూ గండిపేట మండలం నెక్నాంపూర్‌లోని అల్కాపూర్ టౌన్ షిప్ పరిధిలోని ఓ ఇంటి ఓనర్ వద్దకు వెళ్లి తాము హైడ్రా అధికారులమని బెదిరించారు. ఇద్దరు నిందితులు బ్లాక్ కలర్ వాహనంలో ఆ ఇంటికి వచ్చి.. ఇంట్లో ఉన్న వారిని ప్రశ్నించడమే కాక.. ఇంటిని చెక్ చేసినట్లు తెలిసింది.
ఇంటి వాచ్‌మెన్ నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారు తమను తాను హైడ్రా అధికారులుగా చెప్పుకున్నారు. అంతేకాక తమను అడ్డుకుంటే ఇంటిని కూల్చివేస్తామని బెదిరించారు. దీంతో వాచ్‌మెన్ ఇంటి యజమానితో మాట్లాడమని చెప్పినప్పటికీ.. నిందితులు వినకుండా బెదిరింపులకు పాల్పడినట్లు వాచ్‌మెన్ చెప్పుకొచ్చాడు. వారు వెళ్లిపోయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా గురువారం నాడు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని కరీంనగర్ జిల్లా వాసి అయిన మిరియాల వేదాంతం (22), మణికొండ, పుప్పాలగూడలోని ఎస్టీమ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి యెలిశెట్టి శోభన్ బాబుగా గుర్తించారు. వీరిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
అయితే ఈ ఘటనపై హైడ్రా స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది. హైడ్రా పేరుతో బెదిరింపులు, మోసాలకు పాల్పడితే అడ్డుకోవాలని హెచ్చరించింది. ఇలాంటి సంఘటనల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని.. లేదంటే హైడ్రాకు రిపోర్ట్ చేయాలని సూచించింది. హైడ్రాలో పని చేస్తున్న ఉద్యోగి ఎవరైనా దాని పేరును దుర్వినియోగం చేస్తున్నట్లు తేలితే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎవరైనా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే.. 8712406899 నంబరుకు వాట్సాప్‌లో మెసేజ్ చేయాలని.. వీలైతే ఆ వ్యక్తి ఫోటోను కూడా సెండ్ చేయాలని సూచించింది. ఇలాంటి కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.