|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 04:40 PM
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, తన ప్రతి కదలికను ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను ఏం మాట్లాడినా రాష్ట్రంలో సంచలనమవుతోందని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తన కార్యకలాపాలపై ప్రత్యేకం దృష్టి సారించిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తాను ఎక్కడికి వెళుతున్నది, ఏం చేస్తున్నది అనే విషయాలపై నిరంతరం నిఘా కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటానోనని ప్రభుత్వంలో ఆసక్తి నెలకొందని, అందులో భాగంగానే ఈ నిఘా ఏర్పాటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే, తనపై ఎన్ని నిఘాలు పెట్టినా ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రస్తుతానికి ఎలాంటి చర్యలకు పాల్పడబోనని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని తేల్చి చెప్పారు. తనపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాజీనామా చేయబోనని, పార్టీ మారనని, కొత్త పార్టీ పెట్టబోనని స్పష్టం చేశారు.