|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 10:40 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఓల్డ్ ముంబై హైవేపై వరద నీరు నిలిచిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు గురువారం రాత్రి పరిశీలించారు. గత ఆదివారం, బుధవారం భారీగా కురిసిన వర్షాలకు HCU లోని చెరువులన్నీ నిండిపోవడంతో నీరంతా రోడ్డు మీదకు వచ్చిందని అధికారులు తెలిపారు. HCU ఎదురుగా రోడ్డు దాటేందుకు అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే మార్గంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. అక్కడ భూగర్భంలో ఉన్న పైపులు పూడుకుపోయి బ్లాక్ అవ్వడంతో యిబ్బంది ఏర్పడిందని అధికారులు కమిషనర్ కు వివరించారు. రోబోటిక్ మెషీన్లు వెంటనే తెప్పించి పైపులు క్లియర్ చేయాలని సూచించారు. లేని పక్షంలో రహదారిని తవ్వి నీటిని ఎదుటివైపు రోడ్డు దాటించాలన్నారు. అయితే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి రహదారి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అప్పటివరకు ఎప్పటి నీరు అప్పుడు నిరంతరంగా ఇంజన్లతో తోడించాలన్నారు. రహదారిపై నీరు నిలవకుండా తాత్కాలిక ఉపశమన చర్యలు కొనసాగించాలన్నారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూడాలని ఆదేశించారు. హైడ్రా RFO జయప్రకాష్, SFO సతీష్ అక్కడి పరిస్థితిని కమిషనర్ కు వివరించారు.