|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 02:05 PM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ డ్రామా ఆర్టిస్ట్ లాంటివాడని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు రాజకీయ పరిపక్వత లేకపోవడమే ఆయన వ్యవహారశైలి లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గట్టి ప్రతిస్పందనగా జగ్గారెడ్డి, "మీ నాయన కాంగ్రెస్ నుంచే వచ్చాడు, అప్పుడు కాంగ్రెస్ తృతీయ దర్జా పార్టీ అయిందా?" అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను తక్కువచేసే అర్హత కేటీఆర్‌కు లేదని చెప్పారు.
"తెలంగాణ ఇవ్వడానికి కారణమైన పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీలా కనిపిస్తున్నదా?" అని ప్రశ్నించిన జగ్గారెడ్డి, కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాధించామని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత, కేసీఆర్ కుటుంబం సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలపై స్పందించిన జగ్గారెడ్డి, "మీ కుటుంబ రాజకీయాలకు కారణం కాంగ్రెస్ కాదన్నది స్పష్టంగా చెప్పాలి. మీరు రాష్ట్రమంతా కుటుంబ పరిపాలనగా మార్చడం కాంగ్రెస్ వల్ల కాదని ప్రజలు తెలుసుకోవాలి" అని అన్నారు.