|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 07:41 PM
తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త. ఈ ఏడాది దసరా పండగ సెలవుల డేట్స్ వచ్చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే.. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా కలిసి రానుండటంతో విద్యార్థులకు వరుసగా 13 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ సెలవులను బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఇస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి అక్టోబర్ 4న ప్రారంభమవుతాయి. ప్రస్తుతానికి ఇదే అధికారిక షెడ్యూల్ అని, ఏదైనా మార్పులు ఉంటే ముందుగానే తెలియజేస్తామని అధికారులు చెప్పారు.
ఈ సెలవుల సమయంలో కొన్ని ముఖ్యమైన సెలవు దినాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కూడా వస్తుంది. ఇది సాధారణంగా ప్రభుత్వ సెలవుదినం. అక్టోబర్ 3న కూడా సెలవు ఉండటంతో విద్యార్థులకు పండుగ వాతావరణంలో విశ్రాంతి దొరుకుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ సెలవులను ముందుగానే ప్రణాళిక చేసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ సెలవులతో తెలంగాణలో బతుకమ్మ, దసరా వేడుకలు మరింత జోష్గా సాగనున్నాయి. బతుకమ్మ ముగింపు తర్వాత దసరా శోభాయాత్రలు, రావణ దహనం కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.
ఇక ఏపీ ప్రభుత్వం కూడా అక్కడి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా పండగ సెలవులు ఇవ్వనున్నారు. ఏపీలో కంటే తెలంగాణలో మూడు రోజులు ఎక్కువగా పండగ సెలవులు రానున్నాయి. మొత్తంగా దసరాకు తెలంగాణలో 13 రోజులపాటు ఉండనున్నాయి. ఆంధ్రప్రదేలో మాత్రం 10 రోజులు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబర్ 4న పాఠశాలలు ఓపెన్ చేయనుండగా.. అక్టోబరు 5న మిలాన్ ఉన్ నబీ ప్రభుత్వ సెలవు ఉంటుంది. అంటే రోజు వ్యవధిలోనే మళ్లీ సెలవు రానుంది. అటు.. ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవ మిషనరీ విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రత్యేకంగా ప్రకటించారు. క్రైస్తవ విద్యాసంస్థలకు ప్రత్యేకంగా సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. ఈ షెడ్యూల్ ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థులతో పాటు సిబ్బందికి కూడా వర్తిస్తుందని ఏపీ విద్యాశాఖ అధికారులు తెలిపారు.