|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 06:11 PM
బొగ్గు ఉత్పత్తిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఖనిజ అన్వేషణ రంగంలో కీలక విజయం సాధించింది. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్ ప్రాంతంలో ఉన్న బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్‌ను సింగరేణి సంస్థ దక్కించుకుంది. గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వేలంలో 37.75% రాయల్టీ కోట్ చేసి L-1 బిడ్డర్‌గా నిలిచిందని సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. ఈ విజయం సింగరేణి సంస్థకు కీలక ఖనిజాల రంగంలో శుభారంభమని.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దిశలో ఇతర రంగాల వైపు విస్తరించేందుకు ఇది మొదటి అడుగు అని బలరామ్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ అన్వేషణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
దేవదుర్గ్ ప్రాంతంలోని బంగారం, రాగి గనిలో సింగరేణి త్వరలోనే అన్వేషణ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అన్వేషణ అనంతరం, సంస్థ తుది నివేదికను కేంద్రానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా కేంద్రం ఆ గనులను మైనింగ్ కోసం వేలం వేస్తుంది. మైనింగ్ హక్కులు దక్కించుకున్న సంస్థలు, గని ఆపరేషన్ గడువు పూర్తయ్యే వరకు సింగరేణికి 37.75% రాయల్టీ చెల్లిస్తాయి. ఈ అన్వేషణకు సుమారు రూ.90 కోట్లు ఖర్చు అవుతుందని.. ఇందులో రూ.20 కోట్లు కేంద్రం సబ్సిడీగా అందిస్తుందని సింగరేణి తెలిపింది.
ఈ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. బొగ్గు రంగంలో 136 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి ఇప్పుడు కీలక ఖనిజాల అన్వేషణలో ముందంజ వేయడం గర్వించదగిన విషయమని అన్నారు. భారతదేశంలో అగ్రగామిగా భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో సింగరేణి నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎండీ బలరామ్ ఈ విజయాన్ని ఉద్యోగుల కృషికి అంకితం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చి 13న దేశవ్యాప్తంగా 13 ఖనిజ గనుల అన్వేషణ లైసెన్సుల కోసం వేలాన్ని ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి మూడు బ్లాక్లను ఎంచుకుని వాటిపై అధ్యయనం చేసి, వేలంలో పాల్గొంది. మధ్యప్రదేశ్‌లోని పదార్ ప్రాంతంలో ప్లాటినమ్ గ్రూప్ ఎలిమెంట్స్, ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి వద్ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, కర్ణాటకలోని దేవదుర్గ్ వద్ద బంగారం, రాగి గనులు. ఈ మూడు గనుల కోసం ఈ నెల 13, 14, 19 తేదీలలో ఆన్‌లైన్ వేలం జరిగింది. ఇందులో కర్ణాటకలోని దేవదుర్గ్ గనుల అన్వేషణ లైసెన్స్‌ను సింగరేణి దక్కించుకుంది.