|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 07:45 PM
ఇటీవల శ్రీకృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్ రామంతాపూర్‌లో నిర్వహించిన వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కరెంట్ షాక్‌తో మొత్తం ఆరుగురు ప్రాణాలు పోవడం పండగ వేళ సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనపై విద్యుత్ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనకు కారణం.. రోడ్డుకు అడ్డంగా వేసిన కేబుల్ వైర్లు.. కరెంటు తీగలపై పడటంతోనే ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించింది. దీనికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్‌ను అందించింది. ఈ దుర్ఘటన మరిచిపోక ముందే తాజాగా మళ్లీ హైదరాబాద్‌లోనే మరో సంఘటన చోటు చేసుకుంది. పాతబస్తీలోని బండ్లగూడ రోడ్డు వద్ద వినాయకుడి విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ నేపథ్యంలోనే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క .. సంచలన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు పొందుతున్న వారిని గుర్తించి తక్షణమే వారికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను తొలగించాలని.. కేబుల్ ఆపరేటర్లకు సంవత్సరం పాటు సమయం ఇచ్చినప్పటికీ.. వారు కనీసం స్పందించడం లేదని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబుల్ ఆపరేటర్లు వహిస్తున్న నిర్లక్ష్యం కారణంగానే.. చాలా ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. తాజాగా రామంతాపూర్ ఘటనలో ఆరుగురు చనిపోవడం తీవ్ర దుమారం రేపడంతో.. కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఇటీవల తెలంగాణలోని పలు ప్రాంతాల్లో టీవీ, ఇంటర్నెట్ వైర్లను ఇష్టారీతిన కరెంట్ స్తంభాలపై నుంచి లాగడంతో.. వాటిని మెయింటైన్ చేయడంలో కేబుల్ ఆపరేటర్లు చేసిన నిర్లక్ష్యంతో పలు విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇక భట్టి విక్రమార్క ఇచ్చిన ఆదేశాలతో టీజీఎస్పీసీడీఎల్ అధికారులు స్పందించి హైదరాబాద్ నగరంలో రంగంలోకి దిగారు. విద్యుత్ స్తంభాలపై వేలాడే ఇంటర్నెట్, కేబుల్ వైర్ల తొలగించే ప్రక్రియను మొదలు పెట్టాయి. ఈ చర్యతో నగరంలో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు నగరవాసులు నెట్టింట ఫిర్యాదులు చేస్తున్నారు.