|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 06:15 AM
భాగ్యనగర ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'ఫ్రీడమ్ ఆఫర్' కింద ట్రావెల్ యాజ్ యు లైక్ టిక్కెట్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పరిమిత కాలం వరకు మాత్రమే ఈ తగ్గింపు ధర అందుబాటులో ఉంటుంది. ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.మెట్రో డీలక్స్ బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ఈ టిక్కెట్లను కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు. పెద్దలకు ఇంతకుముందు టిక్కెట్ ధర రూ. 150 కాగా, ఆఫర్ కింద రూ. 130కి తగ్గించారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు ఇంతకు ముందు రూ. 120గా ఉన్న టిక్కెట్ ధరను రూ. 110కి తగ్గించారు. పిల్లలకు రూ. 100 ఉండగా, దీనిని రూ. 90కి సవరించారు.