|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 07:37 PM
తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఇందులో భాగంగా రూ. 4,100 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ ఇన్‌ఛార్జ్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖిలా వరంగల్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన ఈ విషయాలను వెల్లడించారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి మొత్తం రూ. 5 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా అభివృద్ధి పథకాలు..
వరంగల్ వాసుల చిరకాల కల అయిన మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం త్వరలో సాకారం కానుందని మంత్రి తెలిపారు. విమానాశ్రయ భూసేకరణ కోసం ఇప్పటికే రూ.205 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కొత్త బస్టాండ్, కాళోజీ కళాక్షేత్రం, నర్సంపేటలోని మెడికల్ కాలేజీ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. భద్రకాళి ఆలయ మాడవీధులు, రాజగోపురాలు, చెరువు ఆధునీకరణ పనులతో పాటు, మత్స్య పరిశ్రమను ప్రోత్సహించడానికి వివిధ చెరువులలో 82 లక్షల చేప పిల్లలను వేసి 16 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు.
మహిళా సాధికారతలో భాగంగా.. బ్యాంక్ లింకేజ్ కింద 7,933 స్వశక్తి మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రూ. 475 కోట్ల రుణాలు మంజూరు చేయడం వరంగల్ జిల్లాకు గర్వకారణమని మంత్రి అన్నారు. ఈ విషయంలో జిల్లాకు అవార్డులు రావడం అభినందనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా.. జిల్లాలో 5 వేల ఎకరాల్లో పామ్ ఆయిల్ తోటలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది 31 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఇక దీంతో పాటు.. మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని గుర్తు చేశారు. దీని ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని.. ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. వీటితో పాటు.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకంలో ఉప పథకం అయిన మహిళలకు ఆర్థిక భరోసా కింద నెలకు రూ.2,500 అందించనున్నారు. దీనిని కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.