|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 05:30 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఒక ప్రహసనమని, అందులో కొత్తదనం ఏమీ లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిందించడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాపాడటమే రేవంత్ పని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తుందని ఆశిస్తే, అందుకు భిన్నంగా పాత పాటనే పాడారని గంగుల ఎద్దేవా చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు వాస్తవాలను బయటపెట్టి, ప్రభుత్వాన్ని నిద్రలేపారని అన్నారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం లేఖ రాయడంతోనే సరిపెట్టారని, సమస్య తీవ్రతను కేంద్రానికి వివరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. "ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదు. ఎంతసేపూ రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడటం తప్ప రేవంత్, ఉత్తమ్‌లకు విషయంపై పట్టు లేదు" అని గంగుల వ్యాఖ్యానించారు. కేసీఆర్ గోదావరి జలాలు వాడుకోమని చెప్పడం బనకచర్లకు అనుమతి ఇచ్చినట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.