![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 29, 2025, 06:20 PM
ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఒక్కొక్కటిగా కొత్త వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఆమె కుమార్తె అరణ్య, తండ్రి శంకర్ ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు స్వేచ్ఛను పదేళ్లపాటు పెంచిన మేనమామ అత్త సుశీల నరసయ్య కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ చిన్ననాటి నుంచి తమ ఇంటిలో ఎంతో ప్రేమతో పెరిగిందని ఆమె భావోద్వేగంగా గుర్తుచేశారు సుశీల మాట్లాడుతూ .. “స్వేచ్ఛను నాలుగు నెలల పాపగా ఉన్నప్పటి నుంచి పదేళ్లు మా ఇంట్లో పెంచుకున్నాం. తన తల్లిదండ్రులు జనశక్తి పార్టీలో పనిచేస్తూ బిజీగా ఉండేవారు. అప్పుడు మమ్మల్ని నమ్మి ఆమెను మా దగ్గరే వదిలారు. స్వేచ్ఛకు ఏ లోటూ లేకుండా ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో పెంచాం. మా సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమ చూపించాం” అని చెప్పారు. గత ఐదేళ్లుగా స్వేచ్ఛ పూర్ణచందర్ నాయక్‌తో సహజీవనం చేస్తూ వస్తోంది. వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, పూర్ణచందర్ స్వయంగా వారికి ఫోన్ చేసి చెప్పిన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. పూర్ణచందర్ కుటుంబానికి స్వేచ్ఛ ఎంతో సుపరిచితమని, అతడి తండ్రి అనేకసార్లు స్వేచ్ఛ ఇంటికి వచ్చేవాడని పేర్కొన్నారు. వారిద్దరు అరుణాచలంలో కలిసి ఉండగా స్వేచ్ఛ పూర్ణచంద్ర ఫోన్‌లో ఉన్న కొన్ని ఫోటోలు చూసిందని, అందులో ఏదో దాచిన విషయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో పూర్ణచందర్ తాత డెత్ యానివర్సరీ సందర్భంగా స్వేచ్ఛను తీసుకెళ్లకపోవడం ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని తెలిపారు. పూర్ణచందర్ నాయక్ కుటుంబంలో తనకు స్థానం లేదని స్వేచ్ఛ అనేకసార్లు బాధపడేదని, కుటుంబ సభ్యురాలిగా ఎందుకు గుర్తించరన్న ప్రశ్నలు ఆమెను తీవ్ర ఆత్మగౌరవ దెబ్బకు గురి చేశాయని చెప్పారు. ఈ నిరాదరణే స్వేచ్ఛను డిప్రెషన్‌లోకి నెట్టేసిందని పేర్కొన్నారు. అరుణాచలం నుంచి స్వేచ్ఛ ఒంటరిగా నెల్లూరు బస్టాండ్‌కి వెళ్లగా, అక్కడి నుంచి పూర్ణచందర్ ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చాడని తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవలు ఆగలేదని, మానసికంగా మరింత క్షోభకు లోనైన స్వేచ్ఛ చివరకు తన ప్రాణాలు తీసుకుందని సుశీల కన్నీటి స్వరంతో చెప్పారు. ఇప్పుడు పూర్ణచందర్ నాయక్ "ఆమెకు నా భార్యస్థానం ఇచ్చా" అంటూ తాను బాధ్యత వహించానని చెబుతూ కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. “నిజానికి స్వేచ్ఛ చావుకు కారణం పూర్ణచందర్ నాయకే. మేము చూసిన, చవిచూసిన అన్ని విషయాలు అదే చెబుతున్నాయి” అంటూ తన వేదనను వ్యక్తం చేశారు.