![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 07:09 PM
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు మంజూరు చేయగా.. కొందరు నిర్మాణాలు మెుదలుపెట్టారు. నియోజకవర్గానికి 3.500 ఇండ్ల చొప్పున తొలి విడతలో కేటాయిస్తుండగా.. దాదాపు లక్ష ఇండ్లకు గ్రౌండిగ్ పనులు జరుగుతున్నాయి. అయితే కొందరు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవటానికి ఆసక్తి చూపటం లేదు. మెుత్తం రూ.5 లక్షల సాయాన్ని సర్కార్ నాలుగు విడతల్లో ఇస్తామని చెప్పింది. బేస్‌మెంట్ లెవల్‌లో రూ. లక్ష, గోడల వరకు మరో లక్ష. స్లాబ్ దశలో రూ.1.25 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిగతా డబ్బులు అకౌంట్లలో జమ చేస్తామని చెబుతోంది. అయితే ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వరోనన్న భయంతో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి వాకటి శ్రీహరి కీలక ప్రకటన చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేసిన మంత్రి.. ఇళ్ల నిర్మాణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయవద్దని లబ్ధిదారులకు సూచించారు. ఎంత త్వరగా పనులు పూర్తి చేసుకుంటే అంత త్వరగా డబ్బులు అకౌంట్లలో జమ అవుతాయని ఆయన భరోసా ఇచ్చారు. బిల్లులు రావు అనే భయంతో ఉండకూడదని.. నిర్భయంగా ఇళ్లు కట్టుకోవాలని సూచిచారు. 'నా ఇళ్లు, ఆస్తులు అమ్మి అయినా సరే మీ డబ్బులు మీకు చెల్లిస్తా' అంటూ మంత్రి శ్రీహరి లబ్ధిదారులకు కీలక హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా పనులు ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య ప్రస్తుతం లక్ష దాటిందన్నారు. జీహెచ్‌ఎంసీ మినహాయించి రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ప్రభుత్వం 3,71,086 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని గుర్తు చేశారు. ఇందులో 2,78,134 ఇళ్లకు అనుమతులు ఇవ్వగా.. ఇప్పటివరకు 1,00,264 ఇళ్లకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు చేయాలన్నారు. ఈ పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి.. అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.