![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 09:57 PM
తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన, అందరికీ అందుబాటులో ఉండే విద్యను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలోప.. దానికి అనుగుణంగా నూతన తరగతి గదులను నిర్మించాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసి, ఉన్నత ప్రమాణాలతో విద్యార్థులకు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యా శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు.
ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు 48 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని అధికారులు సీఎంకు వివరించారు. ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల భారం, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన, సౌకర్యాలపై పెరుగుతున్న నమ్మకం వంటి కారణాల వల్ల ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సానుకూల పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా నూతన తరగతి గదులను వేగంగా నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇది విద్యార్థులకు సౌకర్యవంతమైన అభ్యసన వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం పాఠశాలల్లో అందుకు అనుగుణంగా వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ర్యాంపులు, ప్రత్యేక టాయిలెట్లు, వారికి అవసరమైన అభ్యసన సామగ్రిని అందుబాటులోకి తేవడం ద్వారా సమ్మిళిత విద్యను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. భోజనం తయారుచేసే మహిళలు గ్యాస్, కట్టెల పొయ్యిల వల్ల ఎదుర్కొంటున్న కష్టాల నుంచి వారికి విముక్తి కల్పించాలని ఆయన అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సోలార్ కిచెన్ల ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని ఆదేశించారు. సోలార్ కిచెన్లు పర్యావరణహితమైనవే కాకుండా.. వంట చేసేవారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇది ఇంధన ఖర్చులను తగ్గిస్తాయి.
ఉన్నత విద్యకు ప్రోత్సాహం..
పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్‌లో నమోదు అవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య ఉన్న వ్యత్యాసంపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌లో చేరేలా చూడాలని సూచించారు. ఇది డ్రాపౌట్లను తగ్గించి, ఉన్నత విద్యలో ప్రవేశాలను పెంచుతుంది. ఇంటర్మీడియట్ అనంతరం విద్యార్థులు జీవనోపాధికి అవసరమైన నైపుణ్య ఆధారిత కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని, తద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వృత్తి విద్యా కోర్సులు, ఐటీఐలు, ఇతర స్వల్పకాలిక నైపుణ్య అభివృద్ధి కోర్సులను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చని ఆయన అన్నారు.
చివరగా.. జిల్లాల్లోని అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్శనల ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి వీలవుతుంది. ఇది విద్యా శాఖ పనితీరును మెరుగుపరచి, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. ఈ సమగ్ర విధానం తెలంగాణలో విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.