|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 10:59 AM
ప్రయాణికులపై మెట్రో చార్జీల భారం పడనున్నది. మెట్రో రైల్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి సంస్థ నిర్ణయం తీసుకుంది. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.కనిష్ట ధర రూ.10 నుంచి రూ.12కి పెంచగా.. గరిష్ట ధర రూ. 60 నుంచి రూ.75కు పెంచారు. ప్రయాణ దూరాన్ని బట్టి మిగతా మధ్యస్థ ఛార్జీలు కూడా మారాయి. నాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు, 6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు, 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు, 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు, 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు, 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు, 24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది.ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 – రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొదటి నుండి మెట్రో నష్టాల్లో ఉందని చెబుతున్న సంస్థ.. గతంలోనే ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని మెట్రో రైల్ అధికారులు ఎత్తేశారు. ఇప్పుడు చార్జీలు కూడా పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం మెట్రోపై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులు ఈ ధరలు సామాన్యులకు భారంగా మారుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.