|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 07:24 PM
ప్రముఖ జానపద గాయని మంగ్లీ జన్మదిన వేడుకలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ నగర శివార్లలోని చేవెళ్ల సమీపంలోని ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకలపై పోలీసులు దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి., అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో రిసార్ట్ నుంచి పెద్ద పెట్టున శబ్దాలు వస్తున్నాయని, డీజేతో హోరెత్తిస్తున్నారని స్థానికులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఒక మహిళా ఎస్సై నేతృత్వంలోని బృందంతో కలిసి త్రిపుర రిసార్ట్‌కు చేరుకున్నారు. సుమారు 10 మంది మహిళలు, 12 మంది పురుషులు డీజే సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా గడుపుతున్న దృశ్యం పోలీసులకు కనిపించింది.రిసార్ట్ మేనేజర్‌ను విచారించగా, అది సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక అని, ఆ కార్యక్రమాన్ని తామే నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎలాంటి అధికారిక అనుమతులు తీసుకోలేదని ఆయన పోలీసులకు వివరించారు. పార్టీ జరుగుతున్న ప్రదేశంలో పెద్ద మొత్తంలో విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మద్యానికి కూడా ఎటువంటి అనుమతులు లేవని తేలింది. ఈ సందర్భంగా గాయని మంగ్లీని ప్రశ్నించగా, పార్టీ నిర్వహణకు, మద్యం వినియోగానికి, డీజే ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తీసుకోలేదని ఆమె అంగీకరించినట్లు సమాచారం.అనంతరం పోలీసులు పార్టీలో పాల్గొన్న వారందరికీ మాదకద్రవ్యాల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక వ్యక్తికి గంజాయి సేవించినట్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో, అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించడం, అక్రమంగా విదేశీ మద్యం కలిగి ఉండటం, గంజాయి వినియోగం వంటి ఆరోపణలపై గాయని మంగ్లీ, రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News