|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 11:09 AM
భారీ వర్షాలు ఒక వైపు.. కబ్జాల తొలగింపు మరో వైపు.. ఇలా మల్టీ టాస్కుతో హైడ్రా పని చేస్తోందని కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ రూ. 50 వేల కోట్ల విలువైన 923.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామన్నారు. ఇలా చెరువులు, కాలువల్లో ఆక్రమణలను తొలగించి.. ప్రకృతిని పరిరక్షించడం ద్వరా నగరానికి మంచి భవిష్యత్తును ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. హైడ్రా కార్యకలాపాలను వివరించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు హైడ్రా చర్యలన్నీ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. హైడ్రా పట్ల నగర ప్రజలందరికి మంచి అభిప్రాయం ఉందని.. ఒకరిద్దరు విమర్శించినా భవిష్యత్తులో వాళ్లు కూడా మెచ్చుకుంటారని అన్నారు. తన సర్వీసులో విమర్శలు కొత్త కాదని.. తర్వాత రియలైజ్ అయిన ఘటనలున్నాయన్నారు. ఉదాహరణ 2007వ సంవత్సరం విజయవాడలో జరిగిన అయేషామీరా హత్య కేసులో నిందితుడిగా సత్యంబాబును గుర్తించడంతో పాటు.. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన దర్యాప్తులే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పుడు హైడ్రా చర్యలు కాస్త కఠినంగా అనిపించినా.. నగర భవిష్యత్తు బాగుండాలంటే తప్పవని పేర్కొన్నారు. గొలుసుకట్టు చెరువులను, కాలువలను, ప్రభుత్వ భూములను కాపాడుకోలేకపోతే.. పర్యావరణం దెబ్బతింటుందని హెచ్చరించారు.