|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 05:38 PM
తెలంగాణలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై 'రోడ్ సేఫ్టీ సెస్' పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని ఆయన మండిపడ్డారు. రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి, ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు.రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి రహదారుల భద్రతా ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యతను విస్మరించి, అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని చూడటం దారుణమని కేటీఆర్ అన్నారు. కొత్తగా కొనే ప్రతి వాహనంపై రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు సెస్ వసూలు చేయాలన్న నిర్ణయం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.