|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 05:44 PM
రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ చోటివ్వరని, తొక్కుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. కాంగ్రెస్ లోకి వెళతారన్న ప్రచారాన్ని కవిత తిప్పికొట్టారు. తనకు ఆ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదని తేల్చిచెప్పారు. హరీశ్ రావుతో విభేదాలపై స్పందిస్తూ.. కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్ రావుపై తనకెలాంటి కోపంలేదన్నారు. నీటిపారుదల శాఖలో ఫైళ్లు నేరుగా ముఖ్యమంత్రి వద్దకే వెళుతున్నాయని 2016లోనే తాను కేటీఆర్ కు సూచించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ, హరీశ్‌రావు, సంతోష్ సోషల్ మీడియాలు తనపై చేస్తున్న దాడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాగా, ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకలకు తాను హాజరవుతానని కవిత తెలిపారు.