|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:56 PM
సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు మావోయిస్టులు తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్వాగతించారు. అయితే, శాంతి చర్చల కోసం వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తమ విజయంగా ప్రచారం చేసుకోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. స్పష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలు కలిగిన నక్సలైట్లను టెర్రరిస్టులతో పోల్చుతూ ప్రధాని మోదీ, అమిత్ షా మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గిరిజనులను భయపెట్టి, సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని నారాయణ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగబద్ధంగా 42 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ లక్ష్య సాధన కోసం సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఛండీగఢ్‌లో జరగనున్న పార్టీ జాతీయ మహాసభల్లో అనేక కీలక అంశాలపై చర్చిస్తామని నారాయణ తెలిపారు.