|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:45 PM
ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్న గర్హ్వాల్ బీజేపీ ఎంపీ అనిల్ బలూనీ పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ముందు బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎంపీతో పాటు ఆయన సిబ్బంది కూడా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విపత్తు ప్రభావిత ప్రాంతాలైన చమోలీ, రుద్రప్రయాగ్‌లో పర్యటించిన అనంతరం ఎంపీ బలూనీ తిరిగి రిషికేశ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో దేవప్రయాగ్ సమీపంలో మార్గమధ్యంలో చిన్నగా కొండచరియలు విరిగిపడటాన్ని ఆయన గమనించారు. వెంటనే కారు దిగి, తన సిబ్బందిని, ఇతరులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే, వారు తేరుకునేలోపే ఊహించని విధంగా పర్వతంలోని ఓ భారీ భాగం పెళ్లలు పెళ్లలుగా విరిగిపడింది. భారీగా రాళ్లు, మట్టి కిందకు జారిపడటంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు.ఈ భయానక అనుభవాన్ని బలూనీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్‌లు, కొండచరియలు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నిన్న సాయంత్రం నేను ఎదుర్కొన్న భయానక దృశ్యాన్ని మీతో పంచుకుంటున్నాను. మన రాష్ట్రం ఎంతటి ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొంటోందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు.