|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 05:53 PM
హైదరాబాద్ నగరంలో పాదచారుల భద్రత, రవాణా సౌలభ్యం కోసం మరిన్ని స్కైవాక్‌లను నిర్మించడానికి హెచ్‌ఎండీఏ (HMDA) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఉప్పల్‌లో స్కైవాక్ అందుబాటులోకి రాగా.. మెహిదీపట్నం స్కైవాక్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదే స్ఫూర్తితో కూకట్‌పల్లి జేఎన్‌టీయూ జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోనూ కొత్త ప్రాజెక్టులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టబోతోంది.
హైదరాబాద్ నగరంలో తొలిసారిగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉప్పల్ రింగ్‌రోడ్ వద్ద అత్యాధునిక స్కైవాక్‌ను నిర్మించారు. 660 మీటర్ల పొడవుతో, రూ.25 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ స్కైవాక్ పాదచారులకు రోడ్డు దాటడానికి మాత్రమే కాకుండా, సాయంత్రం వేళల్లో ప్రజల సందర్శనా కేంద్రంగా కూడా మారింది. ఉప్పల్ స్కైవాక్ సక్సెస్ కావటంతో.. హెచ్‌ఎండీఏ మెహిదీపట్నంలో 380 మీటర్ల పొడవైన స్కైవాక్‌ను రూ.34.86 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. డిఫెన్స్ భూముల సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమైనప్పటికీ.. దాని నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మెహిదీపట్నంలో రోజూ లక్షలాది మంది ప్రయాణికులు, వాహనదారులు, పాదచారులు రద్దీగా ఉంటారు. ఈ స్కైవాక్ అందుబాటులోకి వస్తే పాదచారుల ఇబ్బందులు తొలగి, వారికి సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుంది.
నగరంలో అత్యంత రద్దీగా ఉండే కూకట్‌పల్లి జేఎన్‌టీయూ జంక్షన్ వద్ద పాదచారుల ఇబ్బందులను గమనించిన హెచ్‌ఎండీఏ.. ఇక్కడ కూడా స్కైవాక్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ కొత్త స్కైవాక్ జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ నుంచి లులు మాల్ వరకు సుమారు 600 మీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పీపీపీ పద్ధతిలో చేపట్టాలా లేక నేరుగా హెచ్‌ఎండీఏ ద్వారానే నిర్మించాలా అనే విషయాలపై అధికారులు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సిద్ధం చేసి, నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
హైదరాబాద్‌లో ఉన్న మరో కీలకమైన రవాణా కేంద్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా భారీ స్కైవాక్‌ను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే హైదరాబాద్‌లో పాదచారుల భద్రత గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ స్కైవాక్‌లు కేవలం రోడ్డు దాటడానికి మాత్రమే కాకుండా, నగర జీవనంలో అంతర్భాగంగా నిలిచిపోతాయి.