|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 09:48 PM
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో సుమారు రూ.80,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్టీపీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేసింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను వారు వివరించారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తికి ఉన్న అవకాశాలను ఎన్టీపీసీ బృందం సీఎంకు వివరించింది.
ఫ్లోటింగ్ సోలార్ (నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లు) ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో దాదాపు 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు. ఇటువంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తాయని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు, కొత్త ఉద్యోగాల కల్పనకు కూడా ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. ముఖ్యంగా.. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు భూమిని వినియోగించుకోకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది భూమి కొరత ఉన్న ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రంలోని పెద్ద రిజర్వాయర్లు, జలాశయాలు అనుకూలంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తన విద్యుత్ అవసరాల కోసం థర్మల్, జల విద్యుత్ పై ఆధారపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న జనాభా, వ్యవసాయ భూముల విస్తీర్ణం, పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధి కారణంగా విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే.. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఎక్కువగా ఆధారపడుతోంది.
థర్మల్ విద్యుత్ కేంద్రాలు..
థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు, సహజ వాయువు, డీజిల్ వంటి ఇంధనాలను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కేంద్రాలలో ఇంధనాన్ని మండించి, దాని ద్వారా వచ్చే వేడితో నీటిని ఆవిరిగా మార్చి, ఆ ఆవిరి ఒత్తిడితో టర్బైన్‌లను తిప్పి విద్యుత్‌ను తయారు చేస్తారు. తెలంగాణలో పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో కొన్ని ఇప్పటికే వాడుకలో ఉండగా.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.
ప్రస్తుతం పనిచేస్తున్న కేంద్రాలు రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న కేంద్రాలు భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచడానికి దోహదపడతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కూడా కలిస్తే.. అదనపు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.