![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 04:25 PM
బీసీల రిజర్వేషన్ల అమలుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే దక్కేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 51 శాతమున్న బీసీలకు 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 12 శాతమున్న ముస్లింలకు మాత్రం వందకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
వైఎస్ హయాంలో ముస్లింలను బీసీల్లో చేర్చి 4 శాతం రిజర్వేషన్లను అమలు చేసిందన్నారు. ఆ టైంలోనే బీసీ సంఘాలు అడ్డుకుని ఉంటే బీసీలకు అన్యాయం జరిగేది కాదని, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు 10 శాతం ఇస్తామంటున్నారు. ఇది దారుణమన్నారు. వాస్తవానికి బీసీ జనాభా రాష్ట్రంలో 51 శాతం ఉంది. సమగ్ర కుటుంబ సర్వేలోనే ఈ విషయాన్ని తేల్చారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన పేరుతో బీసీల జనాభాను 46 శాతానికి తగ్గించారని ఆరోపించారు. బీసీల సంఖ్యను 5 శాతం తగ్గించారని, కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతూ అందులో 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు అమలు చేస్తున్నారని, తద్వారా బీసీలకు దక్కే రిజర్వేషన్లు 32 శాతమే అని వివరించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని, అయినా ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు.
బనకచర్ల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వాదనను బలంగా విన్పించాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు అంశంపై కేంద్ర ప్రభుత్వం రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతోందన్నారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనని, ఏ రాష్ట్రానికి అన్యాయం చేయదన్నారు. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా సమష్టిగా కృషి చేద్దామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర వాదనను సీఎంల మీటింగ్ లో రేవంత్ రెడ్డి గట్టిగా విన్పించాలని కోరారు.