|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:20 PM
తెలంగాణ సంపదను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి దోచిపెడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన ‘బీఆర్ఎస్ పై నిందలు.. బిల్డర్లతో దందాలు.. ఢిల్లీ పెద్దలకు చందాలు’ అన్న చందంగా నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు మూటల మనిషి అని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని, అది నిజమని తాజాగా తేలిందని చెప్పారు.ఢిల్లీకి మూటలు మోసి పదవులు కొనుక్కున్నాడని, పీసీసీ చీఫ్ పదవి కోసం రూ.50 కోట్లు చెల్లించాడని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి గతంలో ఆరోపించారని కేటీఆర్ గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై కేటీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే కరప్షన్ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే పదవి నుంచి తప్పుకోవాలని ఇదే కాంగ్రెస్ లీడర్లు కర్ణాటకలో డిమాండ్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.