|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:14 PM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ సమీక్ష భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. ఇక, మహాలక్ష్మీ పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ అమాంతం పెరిగింది. ఉచిత బస్సు సౌకర్యం కోసం మహిళలలు పోటెత్తుతుండడంతో జీరో టికెట్ జారీ చేసే సమయంలో కండక్టర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు జేఏసీ తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాల దృష్టికి జేఏసీ తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే మే 6న రవాణా శాఖ మంత్రితో జరిగిన సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావన రావడం, దానికి మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగిందని పేర్కొంది. ఇక, నిన్న డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ సమీక్షా సమావేశంలో మహిళలకు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ఆర్టీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.