|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:20 PM
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణా నదిలో కలిపేసింది కేసీఆరేనని, ఆయన పదేళ్ల పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించేందుకు జనవరి 2 నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం.. బీఆర్ఎస్ అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక 'కరుడుగట్టిన నేరగాడిలా' అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన చేసిన పాపాల వల్లే పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. చేతనైతే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. "ఒకరోజు కృష్ణా జలాలు, మరో రోజు గోదావరిపై చర్చిద్దాం. అసెంబ్లీలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత నాది. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారో లేదో సభకు వస్తేనే తెలుస్తుంది. ఆయన రాకుండా తన 'చెంచాల'ను పంపిస్తే వారితో చర్చించే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేవలం 36 శాతానికే (299 టీఎంసీలు) పరిమితం చేస్తూ సంతకం పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు.