|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 06:11 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ పై స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడిన ఆయన, కేసీఆర్ మళ్లీ ప్రజల ముందుకు రావడం సంతోషకరమని, ఆయన అసెంబ్లీకి వచ్చి పాలనపై చర్చించాలని సూచించారు. నీటి వాటాల విషయంలో కేసీఆర్ హయాంలోనే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.811 టీఎంసీల నికర జలాల్లో మనకు 299 టీఎంసీలు చాలని సంతకం చేసి, మూడు జిల్లాలకు కేసీఆరే మరణశాసనం రాశారు అని తీవ్రంగా విమర్శించారు. ఏపీ జలదోపిడీకి కేసీఆర్ సహకరించారని, తాము 71 శాతం వాటా కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. జనవరి 2 నుంచి కృష్ణా, గోదావరి జలాల వాటాపై అసెంబ్లీలో చర్చిద్దామని ప్రతిపాదించారు."మీ పాలన, మా పాలనపై చర్చిద్దామంటే కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు. ఆయన అసెంబ్లీకి రావాలి, ఆయన గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదు" అని హామీ ఇచ్చారు.ప్రాజెక్టుల విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సూచనలు, నిపుణుల కమిటీ సలహాల మేరకే ముందుకెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నేతలకు అనుమానాలుంటే, నిజనిర్ధారణ కమిటీని వేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.