|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:19 PM
మధ్యవర్తిత్వం వహించి అప్పులు ఇప్పించిన పాపానికి ఒక నిండు సంసారం బలైంది. అప్పు తీర్చాల్సిన వారు ముఖం చాటేయడం, ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన దంపతులు పురుగుల మందు తాగి తనువు చాలించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం జరిగిందీ ఈ విషాద ఘటన. దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష (32), రుక్మిణి (25) దంపతులు బెజ్జంకిలో బట్టల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె హరిప్రియ ఉంది. శ్రీహర్ష తనకు తెలిసిన స్నేహితులు, పరిచయస్తులకు మధ్యవర్తిగా ఉండి సుమారు రూ.13 లక్షల వరకు అప్పులు ఇప్పించారు. అయితే, అప్పు తీసుకున్న వారు సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో అసలు సమస్య మొదలైంది. డబ్బు ఇచ్చిన వారు శ్రీహర్షపై ఒత్తిడి పెంచడం, వేధింపులకు గురిచేయడంతో దిక్కుతోచని స్థితిలో దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు.