|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 07:56 PM
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఈ మహా జాతర కోసం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో తాజాగా కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇందులో భాగంగా బుధవారం మేడారంలోని నూతన గద్దెలపై పగిడిద్దరాజు , గోవిందరాజులను ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్క సమక్షంలో జరిగిన ఈ వేడుకతో మేడారం పరిసరాల్లో జాతర వాతావరణం నెలకొంది. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
బుధవారం ఉదయం నుంచే మేడారంలో ఆధ్యాత్మిక సందడి మొదలైంది. పూజారులు తమ ఆచారాల ప్రకారం దేవమూర్తులను ప్రతిష్ఠించారు. తెల్లవారుజామున 6 గంటలకు గోవిందరాజు గద్దె ప్రతిష్ఠాపన జరిగింది. ఉదయం 9.45 గంటలకు పగిడిద్దరాజు గద్దెను పూజారులు శాస్త్రోక్తంగా కొలువుదీర్చారు. మంగళవారం రాత్రి నుంచే కొండాయి గ్రామం నుంచి వచ్చిన సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారులు తమ కుటుంబాలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వయంగా పాల్గొన్నారు. ఆమెతో పాటు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరాస్వామి, ఇతర అధికారులు హాజరయ్యారు. జాతర ఏర్పాట్లు సజావుగా సాగేలా చూడాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ఠాపన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు భక్తులను గద్దెల ప్రాంగణంలోకి అనుమతించలేదు. కేవలం పూజారుల కుటుంబ సభ్యులు, అధికారులను మాత్రమే లోపలికి పంపించారు.
వచ్చే ఏడాది జనవరి నెలలో నాలుగు రోజుల పాటు ఈ మేడారం మహా జాతర జరగనుంది. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే సమ్మక్క సారక్క మహా జాతర కోసం.. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులు కేటాయించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది.