|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 11:17 AM
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం అమీన్‌పూర్ విలేజ్‌లోని సర్వే నంబర్ 1019, 1020(పి)లో 2.27 ఎకరాల పరిధిలో లే ఔట్ వేశారు. 2005లో 24 ప్లాట్లతో అపెక్స్ ప్రాపర్టీస్ వారు ఈ లే ఔట్ వేశారు. ఇందులో సగం ల్యాండ్ ఓనర్‌వి కాగా.. అపెక్స్ డెవలపర్స్‌వి మిగతావి అనే మాదిరి వేసిన లే ఔట్‌లో 672 గజాల మేర పార్కుకు కేటాయించారు. ఇలా కేటాయించిన పార్కు స్థలాన్ని2013లో ల్యాండ్ ఓనరల్ తన బంధువుకు గిఫ్ట్ డీడ్ చేశారు. ఇక్కడితో వివాదం మొదలైంది. దీనిపై ఇండస్ వ్యాలీ -2 నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. పార్కు స్థలమే అని నిర్ధారణ అవ్వడంతో ఆక్రమణలను తొలగించి.. 672 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. దశాబ్ద కాలంగా పార్కు స్థలం కోసం పోరాడుతున్నామని.. హైడ్రా చర్యలతో ఇది సాధ్యమైందని ఇండస్ వ్యాలీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పార్కు స్థలాన్ని డబ్బుల్లో లెక్క కడితే రూ. 5 కోట్ల విలువ ఉంటుందని పేర్కొన్నారు.