|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:45 PM
వరంగల్‌లో తప్పుడు కేసులు బనాయించి అమాయకులను వేధించిన ఆరోపణలపై ముగ్గురు పోలీస్ అధికారులపై తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండైన వారిలో అప్పటి ఏసీపీ (ప్రస్తుత డీఎస్పీ), ఓ ఇన్‌స్పెక్టర్, ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో ఈ వ్యవహారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే, గతంలో వరంగల్ ఏసీపీగా పనిచేసి ప్రస్తుతం ములుగు సైబర్ క్రైమ్ డీఎస్పీగా ఉన్న నందిరామ్ నాయక్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఇన్‌స్పెక్టర్ టి. గోపిరెడ్డి, పరకాల పోలీస్ స్టేషన్ ఎస్సై విఠల్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.గత ఏడాది వ్యక్తిగత కక్షతో ఓ ఇంటిపై దాడి, దోపిడీ జరిగిందంటూ ఓ వ్యక్తిపై మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఆ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని బాధితుడు ఆధారాలతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఓ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో దీనిపై విచారణ చేపట్టారు.ఈ విచారణలో మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో సుమారు 10 నుంచి 15 వరకు తప్పుడు కేసులు నమోదు చేసి, పలువురిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు తేలింది. విచారణ అధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా డీజీపీ శివధర్ రెడ్డి ఈ ముగ్గురు అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.