|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 08:48 PM
సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదలకు మాత్రమే అనే ఒక అపోహ సమాజంలో బలంగా ఉంది. కానీ.. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఉన్నతాధికారులు తమ కుటుంబ సభ్యుల వైద్యం కోసం సర్కారు దవాఖానాలను ఎంచుకుంటూ ఈ అపోహను పటాపంచలు చేస్తున్నారు. కోట్లకు అధిపతులు, అత్యున్నత హోదాల్లో ఉన్న వారు సైతం సామాన్యులతో కలిసి లైన్లో నిలబడి వైద్యం చేయించుకోవడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో వస్తున్న మార్పుకు నిదర్శనం.
గాంధీ ఆసుపత్రిలో ఐఏఎస్ వీపీ గౌతమ్ భార్య ప్రసవం..
తాజాగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి వీపీ గౌతమ్ తన భార్య గౌతమి ప్రసవం కోసం సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ గాంధీ ఆసుపత్రిని ఎంచుకున్నారు. ఇది ఆమెకు రెండో కాన్పు కావడం, పైగా వైద్య పరిభాషలో దీనిని 'అధిక ముప్పు' (హై రిస్క్) ఉన్న కేసుగా గుర్తించినప్పటికీ.. వారు ప్రభుత్వ వైద్యులపైనే పూర్తి నమ్మకం ఉంచారు.
నాలుగు రోజుల ముందే ఆమెను గాంధీలోని అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించారు. సోమవారం గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ శోభ, సూపరింటెండెంట్ డాక్టర్ వాణి పర్యవేక్షణలో నిపుణులైన వైద్యుల బృందం విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసింది. ఇక్కడ ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో కూడా గౌతమ్ తన మొదటి సంతానం కోసం అక్కడి ప్రభుత్వ ఆసుపత్రినే ఆశ్రయించడం విశేషం.
వీపీ గౌతమ్ మాత్రమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అనేక మంది యువ కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఇదే బాటలో నడుస్తున్నారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష.. తన భార్య డెలివరీ కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకుని ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్.. పాల్వంచలోని సర్కారు దవాఖానాలోనే తన భార్య శ్రద్ధా పాటిల్‌కు ప్రసవం చేయించారు.
అనుదీప్ దురిశెట్టి.. గతంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో తన భార్యకు ప్రసవం చేయించి వార్తల్లో నిలిచారు. పమేలా సత్పతి.. కరీంనగర్ కలెక్టర్ హోదాలో ఉండి కూడా తన ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స కోసం ప్రభుత్వ ఈఎన్‌టీ విభాగానికే వెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడటం వల్లే ఉన్నతాధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.