|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 08:43 PM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సమయంలో స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతుండటంతో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రద్దీ నియంత్రణ కోసం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో తాత్కాలికంగా పలు రైళ్లకు స్టాపేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఐటీ ఉద్యోగాలు చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. కొండాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో పని చేసే ఐటీ ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ తాత్కాలిక స్టాపేజీలు జనవరి 7, 2026 నుంచి జనవరి 20, 2026 వరకు (మొత్తం 14 రోజులు) అమల్లో ఉంటాయి. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. ఈ ఏర్పాట్లలో భాగంగా మొత్తం 16 రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్‌లో ఆగే అవకాశం కల్పించారు. మచిలీపట్నం–బీదర్, నరసాపూర్–లింగంపల్లి, కాకినాడ పోర్ట్–లింగంపల్లి, లింగంపల్లి–విశాఖపట్నం, కాకినాడ టౌన్–లింగంపల్లి వంటి పలు ముఖ్యమైన మార్గాల్లో నడిచే రైళ్లు ఇందులో ఉన్నాయి. అలాగే షిరిడీ–మచిలీపట్నం, షిరిడీ–కాకినాడ పోర్ట్, విశాఖపట్నం–ఎల్‌టిటి ముంబై, ఎల్‌టిటి ముంబై–విశాఖపట్నం వంటి ఎక్కువ దూరం వెళ్లే రైళ్లు కూడా హైటెక్ సిటీ స్టేషన్‌లో తాత్కాలికంగా ఆగనున్నాయి.
ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సమయాల్లో ఈ రైళ్లు హైటెక్ సిటీ స్టేషన్‌కు చేరుకుని బయల్దేరేలా షెడ్యూల్ రూపొందించారు. కొన్ని రైళ్లు ప్రతిరోజూ నడిస్తే... మరికొన్ని సోమ–బుధ–శుక్ర, మంగళవారం లేదా గురువారం వంటి నిర్దిష్ట రోజుల్లో మాత్రమే సేవలు అందిస్తాయి. ఈ పూర్తి వివరాలతో అధికారులు ప్రత్యేకంగా ఒక చార్ట్‌ను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో హైటెక్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులు సికింద్రాబాద్‌కు వెళ్లకుండా.. నేరుగా తమకు దగ్గరైన హైటెక్ సిటీ స్టేషన్‌లోనే రైలు ఎక్కే అవకాశం లభించనుంది. సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు ఇది ఎంతో ఉపశమనంగా మారనుంది.