|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:04 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేవుడితో పోల్చిన ఆమె, తన లేఖ లీక్ అయిందంటూ చేసిన ఆరోపణలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ దేవుడైతే, మరి పార్టీలో దెయ్యం ఎవరంటూ ఆయన కవితను సూటిగా ప్రశ్నించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ... తాను కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు లీక్ అయిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. "కవిత గారూ.. కేసీఆర్ దేవుడైతే, మరి బీఆర్ఎస్‌లో దెయ్యాలు ఎవరు? మీ లేఖను లీక్ చేసిందెవరు? కేసీఆర్ పక్కనే ఉంటున్న కోవర్టులు ఎవరు? మీపై పార్టీలో కుట్రలు పన్నుతున్నదెవరు?" అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.సొంత తండ్రిని నేరుగా కలవకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందని ఆది శ్రీనివాస్ నిలదీశారు. "మీకు ఫాంహౌస్‌లోకి ప్రవేశం లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు?" అని ప్రశ్నించారు. లేఖ లీక్ కావడంపై కేసీఆర్‌ను వివరణ కోరతారా? అని కూడా ఆయన అడిగారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఇంత జరుగుతున్నా మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలవడం లేదని ఆయన అన్నారు.