|
|
by Suryaa Desk | Wed, Sep 10, 2025, 06:15 PM
బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సోనా కామ్‌స్టార్ సంస్థ దివంగత చైర్మన్ సంజయ్ కపూర్ ఆస్తి వివాదం సంచలన మలుపు తీసుకుంది. ఆయన ఆస్తులను చేజిక్కించుకునేందుకు సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్ కపూర్ నకిలీ వీలునామా సృష్టించారని ఆరోపిస్తూ సంజయ్ కపూర్, కరిష్మాల పిల్లలు సమైరా, కియాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి ఆస్తిలో చట్టబద్ధమైన వాటా ఇప్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ ఏడాది జూన్ 12న బ్రిటన్‌లో పోలో ఆడుతూ సంజయ్ కపూర్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణానంతరం ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా సచ్‌దేవ్, ఆమె ఇద్దరు అనుచరులతో కలిసి కుట్రపూరితంగా నకిలీ వీలునామా తయారు చేశారని కరిష్మా పిల్లలు తమ పిటిషన్‌లో ఆరోపించారు. సంజయ్ మరణించిన ఏడు వారాల తర్వాత, జులై 30న జరిగిన కుటుంబ సమావేశంలో ఈ వీలునామాను బయటపెట్టారని వారు పేర్కొన్నారు."మా నాన్న రాశారని చెబుతున్న వీలునామా చట్టబద్ధమైనది కాదు. అది పూర్తిగా నకిలీది. అనేక అనుమానాస్పద పరిస్థితుల మధ్య దీనిని సృష్టించారు. అందుకే ఇప్పటివరకు మాకు అసలు వీలునామా చూపించలేదు, కనీసం దాని కాపీ కూడా ఇవ్వలేదు" అని పిల్లలు తమ పిటిషన్‌లో వివరించారు. తమను క్లాస్-1 చట్టపరమైన వారసులుగా గుర్తించి తండ్రి ఆస్తిలో చెరొక ఐదో వంతు వాటా ఇప్పించాలని వారు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
Latest News