|
|
by Suryaa Desk | Thu, Oct 02, 2025, 05:50 PM
బాలీవుడ్ సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఏకంగా రూ.40 కోట్ల విలువైన నిషేధిత మత్తు పదార్థాలతో ప్రయాణిస్తున్న ఓ యువ నటుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంలో చిన్న పాత్ర పోషించిన విశాల్ బ్రహ్మ (32)గా గుర్తించారు.అసోంకు చెందిన విశాల్ బ్రహ్మ సోమవారం సింగపూర్ నుంచి ఏఐ 347 విమానంలో చెన్నై చేరుకున్నాడు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన డీఆర్ఐ అధికారులు అతడిని ఆపి లగేజీని తనిఖీ చేశారు. ఆయన వద్ద ఉన్న ట్రాలీ బ్యాగులో అత్యంత విలువైన మెథాక్వలోన్ అనే మత్తు పదార్థాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.40 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశాల్‌ను ఓ నైజీరియన్ ముఠా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. తొలుత అతనికి కంబోడియాకు విహారయాత్ర పేరుతో ఆశ చూపి, తిరుగు ప్రయాణంలో డ్రగ్స్‌తో నింపిన బ్యాగును తరలించాలని సూచించినట్లు సమాచారం. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో అతడు ఈ పనికి ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు.
Latest News