|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 04:50 PM
భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ మరో దేశానికి విస్తరించింది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పే, త్వరలోనే మలేషియాలో భారత పర్యాటకులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని గురువారం కీలక ప్రకటన చేసింది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ విభాగమైన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ తో రేజర్‌పేకు చెందిన మలేషియా సంస్థ 'కర్లెక్' భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025 వేదికగా ఈ ఒప్పందం ఖరారైంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, మలేషియా పర్యటనకు వెళ్లే లక్షలాది మంది భారత పర్యాటకులు అంతర్జాతీయ కార్డులు లేదా కరెన్సీ మార్పిడి వంటి ఇబ్బందులు లేకుండా తమకు అలవాటైన యూపీఐ యాప్స్ ద్వారానే సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది భారత యూపీఐ సేవలను ప్రపంచవ్యాప్తం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.