|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 04:12 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు తన ఇంటిని, పార్టీని చక్కదిద్దుకోవాలని హితవు పలికిన ఆయన, రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. "నీకు విజన్ ఉందా? మీ నాన్నకు ఉందా? అన్నది తెలుసుకో. మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల నాటికి నువ్వు అమెరికాలో ఉంటావో, ఇండియాలో ఉంటావో కూడా ప్రజలకు సందేహంగా ఉంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.గురువారం వరంగల్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 కుటుంబాలకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. "ప్రతి సంవత్సరం లక్ష ఇళ్లు కట్టినా, పదేళ్లలో పది లక్షల పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరేది. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమీషన్లపైనే దృష్టి పెట్టింది తప్ప పేదల గృహ నిర్మాణాన్ని పట్టించుకోలేదు" అని ఆయన ఆరోపించారు. పాము కోరల్లో విషం ఉన్నట్టు, బీఆర్ఎస్ నేతలు ఒళ్లంతా విషం నింపుకుని తిరుగుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.