|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 08:25 PM
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలను పూర్తిగా నిలిపివేశాయి. ఈ హఠాత్పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.తమకు ప్రభుత్వం నుంచి రూ.1,400 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఈ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బకాయిలు చెల్లించేంత వరకు సేవలను పునరుద్ధరించేది లేదని ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ పరిణామంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగించాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను ఆయన కోరారు. తాము కల్పించిన స్వేచ్ఛను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "గత తొమ్మిదిన్నర ఏళ్లుగా సేవలు కొనసాగించిన ఆసుపత్రులు, ఇప్పుడే ఎందుకు నిలిపివేశాయో చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో నెలకు రూ.50 కోట్లు కూడా విడుదల కాని పరిస్థితి ఉండేది" అని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలకు రూ.100 కోట్లు చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.