|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 04:46 PM
రియల్ ఎస్టేట్ రంగంలో ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో జరుగుతున్న మోసాలు సమాజంలో నిరంతర సమస్యగా మారుతున్నాయి. “అతి తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇస్తాం”, “ఫ్రీ లాంచ్ స్కీమ్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే 50 శాతం డిస్కౌంట్ తో ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు” అంటూ కొన్ని డెవలపర్స్ ప్రజలను నమ్మబలుకుతున్నారు. ఇలాంటి వాగ్దానాలపై నమ్మకం ఉంచిన చాలా మంది అమాయకులు తమ జీవితాంతం పొదుపు చేసిన డబ్బులను పెట్టుబడిగా పెట్టి, చివరికి మోసపోతున్నారు. తాజాగా హైదరాబాదులో “కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్” అనే కంపెనీ ఇలాంటి ఫ్రీ లాంచ్ ఆఫర్లతో కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటన పెద్ద సంచలనంగా మారింది.
సరూర్‌నగర్, బోడుప్పల్, తట్టియన్నారం ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు ప్రారంభిస్తామని ప్రజలను నమ్మించి వందల కోట్ల రూపాయలు సేకరించారు. కానీ పనులు ప్రారంభించకముందే అకస్మాత్తుగా ఆఫీస్ మూసివేసి బోర్డు తిప్పేశారు. బాధితులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద వరుసగా ఫిర్యాదులు చేశారు. దర్యాప్తులో.. ఆ కంపెనీ ఎండీ శ్రీకాంత్ భారీ స్థాయిలో మోసం చేసినట్లు బయటపడింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలాంటి మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద ప్రాజెక్టులు నమోదు చేయకపోతే వాటిని నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఫ్లాట్ లేదా ప్లాట్ కొనాలనుకుంటే ముందు కంపెనీ బ్యాక్‌గ్రౌండ్, అనుమతులు, రిజిస్ట్రేషన్ వివరాలు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అవగాహన కలిగించడం అత్యంత ముఖ్యమైంది. తక్కువ ధర, త్వరగా లాభం అనే మాయమాటలకు లోనవకుండా జాగ్రత్త పడితేనే ఇలాంటి మోసాల నుంచి రక్షణ సాధ్యమవుతుంది.