|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 08:02 PM
బంగారం ధర సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లో మంగళవారం తులం (10 గ్రాములు) పసిడి ధర తొలిసారిగా రూ. 1,10,000 మార్కును దాటి జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న బలమైన అంచనాల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో ధరలు ఆకాశాన్నంటాయి.ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెల్లడించిన గణాంకాల ప్రకారం, మంగళవారం ఉదయం 10:17 గంటల సమయానికి 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 10,951గా ఉంది. అంతకుముందు ట్రేడింగ్‌లో 10 గ్రాముల ధర ఏకంగా రూ. 1,10,650కి చేరి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సోమవారం ముగింపు ధర రూ. 1,09,820తో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. అంతర్జాతీయంగా కూడా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,679 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.రేపు జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం 96.4 శాతం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు డాలర్ బలహీనపడటం కూడా పసిడి పరుగుకు దోహదం చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.