|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 06:34 PM
కోళ్ల దొంగతనం కేసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మధ్య పెద్ద యుద్ధానికి దారితీసింది. ఆ ఘటన సినిమా స్క్రిప్ట్‌ను తలపించేలా ఉత్కంఠగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన నాలుగు పందెం కోళ్లు పది రోజుల క్రితం చోరీకి గురయ్యాయి. ఆ పందెం కోళ్ల విలువ దాదాపు నాలుగు లక్షల రూపాయలు. వాటిని కోల్పోయిన రంగనాథ్.. చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులకు దొరకని ఆ కోళ్లు.. రంగనాథ్‌కు దొరికాయి. తెలంగాణలోని భద్రాద్రి జిల్లా దమ్మపేటలో ఆ కోళ్లు ఉన్నాయని అతనికి సమాచారం అందింది.
బాధితుడు ఇచ్చిన సమాచారంతో చింతలపూడి పోలీసులు దమ్మపేటకు బయలుదేరారు. ఏకదాటిన నాలుగు కార్లలో దమ్మపేటకు చేరుకున్న ఏపీ పోలీసులు.. నేరుగా శేషగిరి అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ శేషగిరి భార్య మాత్రమే ఉంది. ఏపీ పోలీసులు ఆమెను బెదిరించి.. 'దొంగ కోళ్లు ఎక్కడ ఉన్నాయో చెప్పండి' అంటూ నిలదీశారు. అంతేకాదు, వాళ్లు గేట్లు మూసివేసి, సీసీ కెమెరాలను పగులగొట్టారు, వాటి హార్డ్ డిస్క్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 'మా ఆయన ఇంట్లో లేరు' అని ఆ మహిళ ఎంత చెప్పినా వినకుండా ఏపీ పోలీసులు హల్ చల్ చేశారు. ఆ తర్వాత ఇంటి ఆవరణలో ఉన్న రెండు పందెం కోళ్లను తీసుకుని తమ కార్లలో వేసుకున్నారు.
ఏపీ పోలీసుల హడావుడిని గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున శేషగిరి ఇంటి వద్దకు చేరుకున్నారు. వెంటనే దమ్మపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. దమ్మపేట పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని, ఏపీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరుగా దమ్మపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై శేషగిరి భార్య దమ్మపేట పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. 'ఎలాంటి సమాచారం లేకుండా ఇంట్లోకి వచ్చి దుర్భాషలాడారు. ఇంట్లో వస్తువులను చిందరవందర చేశారు' అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. విషయం తెలుసుకున్న చింతలపూడి సీఐ.. దమ్మపేటకు వచ్చి ఏపీ పోలీసులను విడిపించారు. దీంతో దొంగ కోళ్ల పంచాయితీ చివరకు పోలీసులు వర్సెస్ పోలీసులుగా మారి చర్చనీయాంశమైంది. ఇక కోళ్ల దొంగతనపై రెండు రాష్ట్రాల పోలీసులు విచారణ జరుపుతున్నారు.