|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 07:31 PM
హైదరాబాద్ నగరంలో సొంతిల్లు ఉండాలనేది సామాన్యుల కల. అయితే ఓపెన్ ప్లాట్లు కొనే విషయంలో హైడ్రా భయాలు ఎదురవుతున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియా అక్రమ వెంచర్లలో స్థలాలు అమ్మి మోసాలకు పాల్పడుతుండటంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నమ్మకమైన ప్లాట్లను అందించడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్లాట్లను అభివృద్ధి చేసి విక్రయిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లేఅవుట్లు అభివృద్ది చేసి ప్లాట్లు విక్రయించారు.
తాజాగా.. మరోసారి వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని 2,570 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లాట్ల వేలానికి వస్తున్న అనూహ్య స్పందన నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ఈ నిర్ణయం తీసుకుంది. కోకాపేట, బుద్వేల్‌తో పాటు మరో పది ప్రాంతాల్లో ఉన్న ప్లాట్ల వివరాలను హెచ్‌ఎండీఏ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్లాట్లను విడతల వారీగా విక్రయించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే ఈ-వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఏడాదిన్నర క్రితం వరకు హెచ్‌ఎండీఏ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్లాట్లను వేలం ద్వారా విక్రయించింది. కోకాపేట నుంచి మేడిపల్లి వరకు వివిధ లేఅవుట్లలో ప్లాట్లను విక్రయించడం ద్వారా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.13 వేల కోట్ల మేర ఆదాయాన్ని హెచ్‌ఎండీఏ సమకూర్చింది. అప్పట్లో కేవలం డ్రాఫ్ట్ లేఅవుట్లను ప్రకటించి ప్లాట్లను విక్రయించగా.. ఈ ఏడాదిన్నర కాలంలో హెచ్‌ఎండీఏ ఆయా లేఅవుట్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. బహదూర్‌పల్లి, తొర్రూర్, కుర్మల్‌గూడ, తుర్కయాంజల్, ఇన్ముల్‌నార్వా, కోకాపేట లేఅవుట్లలో పనులు తుది దశకు చేరుకోగా, మేడిపల్లి, బాచుపల్లి, మోకిల, బుద్వేల్ తదితర లేఅవుట్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
హెచ్‌ఎండీఏకు కోకాపేటలో 24.05 ఎకరాల విస్తీర్ణంలో ఐదు ప్లాట్లు ఉన్నాయి. బుద్వేల్‌లో ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఒక ప్లాటు సిద్ధంగా ఉంది. వీటితో పాటు, 150 చదరపు గజాల నుంచి వెయ్యి చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 2,564 ప్లాట్లు శివారులోని 10 ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి మొత్తం విస్తీర్ణం 9.16 లక్షల చదరపు గజాలు అనగా.. సుమారు 189 ఎకరాలు వరకు ఉంటుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే,.. తొలి విడతలో కోకాపేట, బుద్వేల్‌లోని ప్లాట్లను, ఆ తర్వాత మిగిలిన ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించే అవకాశం ఉంది.