|
|
by Suryaa Desk | Thu, Oct 02, 2025, 05:55 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'ఓజీ’. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ అందుకుంది. గతరాత్రి ఈ చిత్రం విజయోత్సవ సభ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో, ఓజీ కోసం పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తాను తమిళ స్టార్ హీరో విజయ్‌ను అత్యంత కష్టపడి పనిచేసే హీరోగా భావించేవాడినని, కానీ ‘ఓజీ’ కోసం పవన్ కల్యాణ్ ఆయన్ను మించిపోయారని అన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.‘ఓజీ’ చిత్రానికి ఇద్దరు సినిమాటోగ్రాఫర్లలో ఒకరిగా పనిచేసిన మనోజ్, తన షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌తో పనిచేసిన 16 రోజులు ఒక రోలర్ కోస్టర్ ప్రయాణంలా సాగాయని తెలిపారు. "పవన్ సర్‌తో గతంలో పనిచేసినప్పటికీ, ఓజీలో ఆయన విశ్వరూపం చూశాను. వరుసగా యాక్షన్ ఘట్టాలు, భావోద్వేగ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్ సీన్లు చేస్తూనే.. మరోవైపు అధికారిక పనుల కోసం చిన్న విమాన ప్రయాణాలు చేసేవారు. ఒక చేతిలో కత్తి, రక్తంతో సెట్ లోనే అధికారిక పత్రాలపై సంతకాలు చేస్తూనే, జపనీస్ డైలాగులు నేర్చుకోవడం చూశాను. ఎవరికైనా ఇది చాలా కష్టమైన పని, కానీ మీరు ఎంతో పట్టుదలతో, తేలికగా పూర్తి చేశారు. సినిమా పట్ల మీకున్న అభిరుచికి ఇది నిదర్శనం" అని మనోజ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Latest News