|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 09:29 PM
వాహనాలు తీసుకుని రోడ్లపైకి వచ్చే ప్రతీ వాహనదారుడు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు విధించే భారీ జరిమానాలను కట్టాల్సిందే. అయితే చాలా మంది ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడుపుతూ ఉంటారు. ఎన్ని ట్రాఫిక్ చలాన్లు పడినా.. వాటిని కట్టకుండా తిరుగుతూ ఉంటారు. అలాంటి వారు ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే.. ఇక వారి సంగతి అంతే. వాహనాలను సీజ్ చేయడమే కాకుండా వారిపై కేసులు కూడా నమోదు చేస్తూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు ఒక ఘటన జరిగింది. హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తూ.. పదుల సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. అయితే అతడి బైక్‌పై ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే 57 చలాన్లు వేశారు. కానీ అతడు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ ట్రాఫిక్ చలాన్లు మొత్తం రూ.58,895 పేరుకుపోయింది. దీంతో తాజాగా ఆ బైక్ పోలీసులకు పట్టుబడింది.
ఏపీ 37 డీఎస్ 3639 అనే నంబర్ ప్లేట్ కలిగిన ఆ బైక్ 57 సార్లు రాంగ్‌రూట్‌లో వెళ్లి ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన నిఘా కెమెరాకు చిక్కింది. దీంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ప్రతీసారి చలాన్లు పడ్డాయి. ఈ క్రమంలోనే ఆదివారం రోడున సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్‌ను గుర్తించి.. సీజ్ చేశారు. ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లోని సాగర్ కాంప్లెక్స్ నుంచి గుర్రంగూడకు వెళ్లే మార్గంలో రాంగ్‌రూట్‌లో వెళ్లడంతో జరిమానా పడినట్లు ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి ప్రాంతాల్లో ఆ బైక్ ఎక్కువగా రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడంతో చాలా ఫైన్లు పడినట్లు వెల్లడించారు.
ఇక గతంలో రాంగ్ రూట్లో వెళ్తే ట్రాఫిక్ జరిమానా తక్కువగానే ఉండేది. కానీ.. ఇలా ఇష్టం వచ్చినట్లు వాహనదారులు రాంగ్ రూట్లలో వెళ్లడంతో తోటి వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఆ మార్గంలో ప్రయాణించే పాదచారులకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక ప్రమాదాలు కూడా జరగడంతో అధికారులు ఈ రాంగ్ రూట్ చలాన్ రెట్లను భారీగా పెంచారు.
ప్రస్తుతం కొత్త రూల్స్ ప్రకారం.. రాంగ్ రూట్‌లో వెళ్లి ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే రూ.1200 ఫైన్ విధిస్తున్నారు. మరోవైపు.. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం కూడా ఇప్పటివరకు లేకపోగా.. తొలిసారిగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక ముందుకు వెళ్లి యూటర్న్ ఉన్న దగ్గర మలుపు తీసుకోవడం ఎందుకని భావించి చాలా మంది వాహనదారులు.. రాంగ్ రూట్‌లో వెళ్తూ ఉంటారు. అది ట్రాఫిక్ ఉల్లంఘనతోపాటు ప్రమాదకరమని తెలిసినప్పటికీ అలాగే వెళ్తుంటారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం వల్లే ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని గుర్తించిన నగర ట్రాఫిక్ పోలీసులు.. ఇక నుంచి కఠిన వైఖరి అవలంబించనున్నట్లు తెలిపారు.
ఇన్నాళ్లు రాంగ్ రూట్‌లో వెళ్లేవారిపై జరిమానాలు మాత్రమే వేస్తుండగా.. వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో రాంగ్ రూట్‌లో వెళ్లేవారిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ వారు ఏదైనా ప్రమాదం చేస్తే.. జైలు శిక్ష కూడా విధించనున్నారు.