|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 02:33 PM
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ప్రధాని మోదీ మరణాన్ని ఆకాంక్షించేలా ఆయన మాట్లాడారంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది. సుమారు వారం క్రితం తన నియోజకవర్గంలోని ఒక కార్యక్రమంలో భూపతి రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలను విమర్శిస్తూ, "వాళ్లు ఎప్పుడూ రాముడు అంటారు... వాళ్లు పుట్టినందుకే రాముడు పుట్టినట్టు! వాళ్లు పోతే రాముడు కూడా పోతాడట! మోదీ చస్తే రాముడు కూడా పోతాడా? మోదీ ఇంకెన్ని రోజులు బతుకుతాడు? ఆయనకు ఇప్పటికే 75 ఏళ్లు వచ్చాయి" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియో క్లిప్‌ను బీజేపీ నేతలు గురువారం సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది.