|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 07:23 PM
ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన ఆర్ఆర్ఆర్ బాధితులు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ బాధితులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే మీ సమస్య ఢిల్లీ వరకు వెళుతుందని ఆయన అన్నారు. సమస్యలపై మాట్లాడటానికి తమకు అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కత్తి వాళ్ల చేతిలో పెట్టి యుద్ధం బీఆర్ఎస్‌ను చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల భూముల్లో నుంచి రోడ్డు వెళ్లకుండా అలైన్‌మెంట్ మార్చడం కొత్తేమీ కాదని అన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు కూడా అష్టవంకర్లు తిప్పారని విమర్శించారు.గతంలో ఓఆర్ఆర్‌కు భూసేకరణ సమయంలో భూమికి బదులు భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. ట్రిపుల్ ఆర్ వల్ల భూమి కోల్పోతున్న రైతులకు భూమి కావాలంటే పోరాటం చేయవచ్చని కేటీఆర్ అన్నారు. అలైన్‌మెంట్ శాస్త్రీయంగా ఉండాలని ఉద్యమం చేద్దామని ఆయన అన్నారు.