|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 08:12 PM
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహా జాతర కోసం రూపొందించే అభివృద్ధి ప్రణాళికలు పూర్తిగా గిరిజన సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించే విధంగా ఉండాలని సూచించారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మేడారం జాతర అభివృద్ధి ప్రణాళికపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మేడారం జాతర అభివృద్ధి పనుల రూపకల్పనలో గిరిజన సంప్రదాయాలకు ఏ మాత్రం భంగం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రణాళికపై తుది నిర్ణయం తీసుకునే ముందు, సమ్మక్క సారలమ్మ పూజారులతో సంప్రదించి, వారి సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా.. ముఖ్యమంత్రి స్వయంగా ఈ నెల 23న మేడారం సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించనున్నారు. అక్కడే పూజారులు, గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై తుది ప్రణాళికకు ఆమోదం తెలపనున్నారు.
పూజారుల విజ్ఞప్తి మేరకు ఆలయ ఆవరణను మరింత విస్తరించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అయితే అమ్మవార్ల గద్దెలను యథాతథంగా ఉంచి, వాటి పవిత్రతకు భంగం కలగకుండా చూడాలన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి సాంకేతిక అంశాలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో స్థానిక గిరిజన సంప్రదాయానికి అనుగుణంగా ఉండే వృక్షాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జాతరకు వచ్చే భక్తులను స్వాగతించే తోరణాలు సైతం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. మేడారం జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని రేవంత్ వెల్లడించారు. మేడారం జాతరను మరింత ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.