|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 04:47 PM
తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఎఎం) విధానంలో నిర్మించతలపెట్టిన రోడ్ల జాబితాను ప్రభుత్వం సవరించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు రోడ్లు భవనాల శాఖ ఈ మార్పులు చేసింది. గతంలో రూపొందించిన ప్రణాళికలో ప్రాధాన్య క్రమం లేకపోవడం, చిన్నచిన్న రోడ్లను కూడా చేర్చడం వంటి లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆర్అండ్బీ శాఖ దాదాపు 5,190 కిలోమీటర్ల మేర 373 రోడ్లను 17 ప్యాకేజీలుగా విభజించి నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ నివేదికను కేబినెట్ కూడా ఆమోదించింది.
అయితే, తాజా సమీక్షలో ప్యాకేజీల సంఖ్యను 11 లేదా 9కి తగ్గించి ఉమ్మడి జిల్లాలవారీగా ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల పనుల పర్యవేక్షణ సులభతరం అవుతుందని.. ప్రాజెక్టుల వేగం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సవరించిన జాబితాలో రోడ్ల ఎంపికకు కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. గతంలో కేవలం 10 కిలోమీటర్ల పొడవున్న రోడ్లను కూడా చేర్చగా.. ఇప్పుడు కనీసం 50 కిలోమీటర్లకు పైగా పొడవున్న రోడ్లను మాత్రమే కారిడార్ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రాజెక్టుల ప్రభావం, నాణ్యత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్లలో అత్యధికంగా రద్దీ ఉండే మార్గాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే రోడ్లు, ప్రముఖ ఆలయాలకు అనుసంధానం చేసే రహదారులను ఎంపిక చేశారు. కొన్నిచోట్ల ఈ రోడ్లను గ్రీన్‌ఫీల్డ్ తరహాలో అంటే పూర్తిగా కొత్తగా నిర్మించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యయం భరించడానికి.. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి హ్యామ్ (హెచ్ఎఎం) మోడల్‌ను ఎంచుకున్నారు. ఈ విధానంలో.. రోడ్ల నిర్మాణ ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వం, మిగతా భాగాన్ని కాంట్రాక్టర్లు భరిస్తారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో నెలవారీ వాయిదాలు చెల్లిస్తుంది. ఈ మోడల్ ప్రభుత్వానికి ఒకేసారి భారీ ఆర్థిక భారం పడకుండా ప్రాజెక్టులను చేపట్టడానికి వీలు కల్పిస్తుంది.
ప్రస్తుతం సవరించిన నివేదికను కేబినెట్ ఆమోదం కోసం సిద్ధం చేశారు. త్వరలో ఈ నివేదికను సమర్పించి టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మార్పుల వల్ల తెలంగాణలో రోడ్ల నెట్వర్క్ మరింత మెరుగుపడి, ప్రజలకు ప్రయాణాలు సౌకర్యవంతంగా మారతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.