|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 07:02 PM
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ పై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై సీఎం రమేశ్ అక్రమంగా పోలీసు కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రమేశ్ చేసిన అసత్య ఆరోపణలను తాను ఖండించినందుకే కక్షపూరితంగా ఈ చర్యకు పాల్పడ్డారని కిశోర్ విమర్శించారు.ఈ విషయంపై గాదరి కిశోర్ మాట్లాడుతూ, "సీఎం రమేశ్ ఒక రాజకీయ వ్యభిచారి. ఆయన కేటీఆర్ గురించి అసత్య ఆరోపణలు చేస్తే, నేను వాటిని ఖండిస్తూ మాట్లాడాను. ఆ కారణంగానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నాపై అక్రమ కేసు బనాయించారు" అని తెలిపారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.ఇలాంటి కేసులకు తాను భయపడబోనని గాదరి కిశోర్ స్పష్టం చేశారు. "బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఎన్ని కేసులు పెట్టినా మేం భయపడే ప్రసక్తే లేదు. మా పార్టీ నాయకుల గురించి ఎవరైనా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే, వారు ముఖ్యమంత్రి అయినా, ఎంపీ అయినా సరే.. కచ్చితంగా తిప్పికొడతాం" అని ఆయన హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.